కరోనా మహమ్మారి సోకిన వారికే కాకుండా ఇతరులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కరోనా లాక్డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన చిన్నారుల్లో ఊబకాయం సమస్య మరింత పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆహారపు అలవాట్లు, నిద్రలో మార్పులు, శారీరక శ్రమ తగ్గటం వల్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు స్పష్టం చేసింది.
"ఊబకాయంతో బాధపడే పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా వీరికి సహకరించని వాతావరణం ఏర్పడింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లను కొనసాగించటం కుదరడం లేదు. ఫలితంగా ఊబకాయం సమస్య మరింత పెరుగుతోంది. "
- మైల్స్ ఫేత్, బఫెలో విశ్వవిద్యాలయం పరిశోధకుడు
వేసవి సెలవుల్లో 18 ఏళ్లలోపువారు సాధారణంగానే బరువు పెరుగుతారు. ప్రస్తుతం ఇంటికే పరిమితం కావటం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఇటలీ వెరోనాలోని 41 మంది చిన్నారులు, టీనేజర్లపై అధ్యయనం చేశారు పరిశోధకులు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు వీరి శారీరక శ్రమ, నిద్ర సమయం, ఆహారపు అలవాట్లు, బరువు వివరాలు సేకరించారు. ఈ ఫలితాలు ఒబెసిటీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.