ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా శనివారం నుంచి ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో 85 వేల మందికిపైగా వైరస్ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 54.5 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనా దెబ్బకు మృతిచెందినవారి సంఖ్య 3.45 లక్షలపైకి ఎగబాకింది. అమెరికాలో మరణాలు లక్షకు చేరువయ్యాయి.
కొవిడ్ కోరల్లో: 24 గంటల్లో 85 వేలకు పైగా కొత్త కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 85 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాలు కొవిడ్-19 ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. మరోవైపు చైనాలో కూడా నిన్న కొత్తగా 39 కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
రష్యాలో తాజాగా 24 గంటల్లో 153 మంది ప్రాణాలను కొవిడ్-19 బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో సంభవించిన అత్యధిక మరణాలు ఇవే. ఆ దేశంలో కొత్తగా 8,599 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. గత మూడు వారాల్లో 24 గంటల్లో నమోదైన అత్యల్ప కేసులివే కావడం గమనార్హం. కేసులు ఎక్కువగా నమోదవుతున్న బ్రెజిల్‌లో మరణాల తీవ్రత కూడా అధికంగానే ఉంది. అక్కడ మృతుల సంఖ్య 22 వేలు దాటింది. పాకిస్థాన్‌లో మరో 32 మంది కొవిడ్-19 దెబ్బకు మృత్యువాతపడ్డారు. దీనితో మరణాల సంఖ్య 1,133కు పెరిగింది. ఇప్పటివరకు ఆ దేశంలో 54,601 మందికి వైరస్ సోకింది.
- చైనాలో కొత్తగా 39 మంది కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. అందులో 36 అసింప్టమాటిక్ కేసులు.
- ఇండోనేసియాలో తాజాగా 526 కేసులు వెలుగుచూశాయి. ఆ దేశంలో బాధితుల సంఖ్య 22,271కి పెరిగింది.
- దక్షిణ కొరియాలో మరో 25 మంది వైరస్ పాజిటివ్‌గా తేలారు.
- వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వల్ల సరిహద్దుల్లో ఆంక్షలను సోమవారం నుంచి సడలించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. విదేశాల నుంచి ప్రజలను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. బ్రిటన్, స్పెయిన్ నుంచి వచ్చేవారు 14 రోజులపాటు స్వచ్ఛందంగా క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.
- జన సంచారంపై నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ తాజాగా అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర క్యాపిటోల్ భవనం ఎదుట వందల మంది నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియాను కుదిపేసిన ప్రచండ తుపాన్