తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

అమెరికాలో తొలి దశ ప్రయోగాల్లో సత్ఫలితాలు పొందిన మోడెర్నా టీకా మూడోదశకు సిద్ధమైంది. దాదాపు 30 వేల మంది వాలంటీర్లకు టీకాను ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలెట్టింది మోడెర్నా సంస్థ. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది.

corona-virus-vaccine-put-to-final-test-by-american-moderna-pharma
ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

By

Published : Jul 28, 2020, 12:45 PM IST

ప్రాథమిక ప్రయోగాల్లో ఆశాజనక ఫలితాలు సాధించి కొవిడ్‌-19 టీకాపై ఆశలు పెంచిన మోడెర్నా సంస్థ మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 30 వేల మంది వాలంటీర్లకు టీకాను ఇచ్చే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. మోడెర్నాతో పాటు ఫైజర్‌ కూడా ఈ ప్రయోగాలను చేపడుతోంది. వ్యాక్సిన్‌ భద్రతతో పాటు ఏస్థాయి కొవిడ్‌ను‌ ఇది అడ్డుకొంటుందనే అంశాలను నిర్ధారించడమే ఈ మూడో దశ ప్రయోగాల లక్ష్యం.

ఈ ప్రయోగాలు విజయవంతమైతే 2020 చివరి నాటికి ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కొలిన్స్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసినట్లైతే ప్రయోగాలు పూర్తయ్యే నాటికి మోడెర్నా వద్ద లక్షల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

బిలియన్ డోసులే లక్ష్యంగా..

ప్రయోగాలు సఫలమైతే.. అక్టోబర్‌ ఆరంభంలోనే అధికారిక అనుమతులు పొందేందుకు చర్యలు చేపడతామని ఫైజర్‌ తెలిపింది. అమెరికాలో 50 లక్షల మందికి ఒక్కొక్కరికీ రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్‌ను అందించేందుకు ఇప్పటికే ఫైజర్‌ హక్కులు పొందింది. 2021 చివరి నాటికి 1.3 బిలియన్‌ డోసుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. మోడెర్నా ఏడాదికి బిలియన్‌ డోసుల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

మోడెర్నా ప్రయోగాలపై అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సైతం విశ్వాసంగా ఉన్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు నవంబరు చివరినాటికి లేదా అంతకంటే ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌నకు అన్ని వివరాలు తెలియజేసినట్లు తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ వ్యాక్సిన్‌ భద్రతపై ఫౌచీ నమ్మకం వ్యక్తం చేశారు. టీకా అభివృద్ధికి అమెరికా భారీ నిధులు సమకూర్చిన విషయం తెలిసిందే.

ఈ టీకా అభివృద్ధిలో ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్ల తయారీ సాంకేతికతకు భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో అత్యంత వేగంగా టీకాను ఉత్పత్తి చేయవచ్చని మోడెర్నా గతంలో తెలిపింది. ఎంఆర్‌ఎన్‌ఏ-1273గా నామకరణం చేసిన ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను సమాయత్తం చేస్తుంది.

ఇదీ చదవండి: శాస్త్రీయ పరిశోధనలకు భారత్​-బ్రిటన్​ మధ్య ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details