ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. చాలా దేశాలు వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
అమెరికాలో ఉద్ధృతంగా..
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. రోజూ భారీ సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 50,262 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 30 లక్షలకు చేరింది. కరోనా ధాటికి 1,32,961 మంది మరణించారు.
దక్షిణ అమెరికాలో..
బ్రెజిల్లో నెమ్మదిగా మొదలైన కరోనా వ్యాప్తి ఊహకందని రీతిలో విజృంభించింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్లో తాజాగా 21 వేల మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 16.26 లక్షలకు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 65 వేల మంది మృతి చెందారు.
దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ, అర్జెంటీనాల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ దేశాల్లో మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.