కరోనా వ్యాక్సిన్ తయారీ.. సొరచేపల(షార్క్) ప్రాణాల మీదకొచ్చింది. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో సొరచేపల కాలేయం నుంచి తీసే స్కాలేన్ అనే నూనెను వినియోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడే ఈ నూనె కోసం ఎప్పటి నుంచో సొరచేపల వేట కొనసాగుతోంది. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ తయారీలోనూ దీన్నే వినియోగిస్తున్నారు, దీంతో సొర మత్య్సాల మనుగడ ప్రమాదంలో పడింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే సొరచేపల సంరక్షణ సంస్థ ఒకటి ఈ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేసింది.
ఒక టన్ను స్కాలేన్ కావాలంటే సుమారు 3 వేల సొరచేపలు అవసరం. ప్రపంచ జనాభా అంతటికి స్కాలేన్ ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇవ్వాలంటే 2.5 లక్షల సొరచేపలు కావాలి. అదే ఒక్కొక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 5 లక్షల సొరచేపలను చంపాలి. అందులోనూ స్కాలేన్ పుష్కలంగా లభించే గల్పర్ షార్క్ బాస్కింగ్ షార్క్ రకాలు అరుదైనవి. అంతరించిపోతున్న జీవుల జాబితాలోనూ ఇవి ఉన్నాయి. ఇతర సముద్ర జీవుల్లా అవి వాటి సంతతిని వేగంగా పునరుత్పత్తి చేసుకోలేవు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీ క్రమంలో వాటి వేట ముమ్మరమైతే కొద్ది కాలానికే అంతరించిపోయే ప్రమామదముంది.