ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి ప్రభావంతో అనేక పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మరింత పెరగనుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
కరోనా వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని ఐరాస అనుబంధ సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) అంచనా వేసింది. మరింత మందికి ఆదాయం కోత తప్పదని స్పష్టం చేసింది.
కొవిడ్-19 వ్యాప్తి వల్ల ఆర్థిక, కార్మిక సంక్షోభం ఏర్పడిందని ఐఎల్ఓ తెలిపింది. ఈ వైరస్ ధాటికి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 8వేల మందికి పైగా మరణించారు. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐఎల్ఓ ప్రధాన కార్యదర్శి గయ్ రైడర్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరింత పెరిగే అవకాశం..
వైరస్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోయేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని యూఎన్ ఏజెన్సీ ఓ అధ్యయనంలో తెలిపింది. సంబంధిత ప్రభుత్వాలు వీలైనంత త్వరగా స్పందిస్తే బాగుంటుందన్న ఐరాస.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సుమారు 50.3 లక్షల మంది సంక్షోభం కారణంగా ఉపాధిని కోల్పోతారని స్పష్టం చేసింది.
3.4 ట్రిలియన్ డాలర్ల నష్టం..
అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్వయం ఉపాధి, ఆర్థిక స్థితిగతులపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు అంటున్నాయి. పనికి ప్రాధాన్యం తగ్గడం వల్ల కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గనుందని అంచనావేశాయి. ఈ ఏడాది 860 బిలియన్ డాలర్ల నుంచి 3.4 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నారని ఐరాస తెలిపింది.
2008లో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచం ఓ ఐక్యకూటమిని ఏర్పాటుచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లోనూ అలాంటి నాయకత్వం అవసరమని ఐఎల్ఓ చీఫ్ రైడర్ చెప్పారు.
ఇదీ చదవండి:ఇటలీపై కరోనా దాడి.. ఒక్కరోజే 475 మరణాలు