Corona Infection In Vaccinated People: భారత్ సహా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వందలో 90 శాతానికిపైగా టీకా వేసుకున్న వారికే సోకుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా వేసుకున్నవారికి కొవిడ్ రావటానికి రెండు కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోలిస్తే అంత ప్రమాదకరమైనది కాకపోయినా వేగంగా వ్యాపిస్తోంది. చాలా ప్రాంతాల్లో సెలవు ప్రయాణాల సీజన్‌లోనే ఈ కేసుల పెరుగుదల నమోదైంది.
టీకాలు వైరస్‌ను పూర్తిగా అడ్డుకుంటాయనే తప్పుడు అభిప్రాయం ప్రజల్లో ఉందని నిపుణులు అంటున్నారు. తీవ్రమైన అనారోగ్యానికి గురికాకుండా మాత్రమే టీకాలు పనిచేస్తాయని మిన్నెసోట విశ్వవిద్యాలయంలోని వైరస్ పరిశోధకుడు లూయిస్ మన్‌స్కీ తెలిపారు. 2 డోసుల ఫైజర్, మోడెర్నా, ఒక డోసు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు వేసుకుంటే ఒమిక్రాన్ సోకినా తీవ్ర అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వీటి బూస్టర్ డోసులు వేసుకుంటే ఇన్‌ఫెక్షన్ నుంచి కూడా తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసు వైరస్‌కు అడ్డుకట్టవేసే యాంటీబాడీలను పునరుద్ధరిస్తోంది. వైరస్ లోడ్ ఎక్కువగా ఉండే వారి నుంచి టీకా వేసుకోని వారికి కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Coronavirus Infection: టీకా వేసుకున్నవారికి వైరస్ సోకినా రోగ లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత రోగ నిరోధక వ్యవస్థలోని బహుళ రక్షణ మరింత క్రియాశీలమవుతుంది. అందువల్ల ఒమిక్రాన్ వేరియంట్ బహుళ రక్షణ వ్యవస్థను దాటుకుని వెళ్లటం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. అందుకే వైరస్ భద్రతా సూచనల్లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇండోర్‌లో మాస్క్‌లు ధరించటం, జనసమూహాలకు దూరంగా ఉండటం, టీకాలతో పాటు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. టీకాలు వైరస్ సోకకుండా నివారించకపోయినా ప్రాణాపాయం లేకుండా చేయటం సహా ఆస్పత్రిలో చేరికను నియంత్రిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కరోనా కేసులు..