అమెరికాలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్థారించారు వైద్యులు. అయితే ఇటీవల విదేశాలకు ప్రయాణించని అతడికి ఎవరి నుంచి వైరస్ సోకిందో తెలియక ఆందోళన చెందుతున్నారు అధికారులు. ఇలా ఎవరి నుంచి సోకిందో తెలియకుండా వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో కరోనా వ్యాప్తి వేగం పెరిగే అవకాశముందని హడలిపోతున్నారు.
ఆరిజాన్ రాష్ట్రంలో తాజా కేసు నమోదైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఇటీవలే ఓ పాఠశాలను సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. బడిని మూసివేశారు.
'ఈ కేసులో వైరస్ సోకింది కానీ, ఇది ఎవరి నుంచి వ్యాపించిందనేది ఇంకా తెలియదు. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, వైరస్ను ముందుగా కనిపెట్టడం ఇప్పుడు చాలా అవసరం. కరోనాను నివారించేందుకు అదనపు చర్యలు తీసుకోవాలి. కసీసం వైరస్ వ్యాప్తిని తగ్గించగలగాలి. కరోనా సోకకుండా ప్రజలు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ఇంట్లో ఉండి చదువుకుంటే మంచిది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.'
-సారా కాడీ, వైద్యుడు.