తెలంగాణ

telangana

ETV Bharat / international

దశాబ్దాల పాటు కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్‌ఓ - CHINA

ప్రపంచంపై విరుచుకుపడుతున్న కొవిడ్​ మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని అంచనా వేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). వైరస్​ వెలుగులోకి వచ్చి.. 6 నెలలు దాటిన నేపథ్యంలో సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ప్రపంచదేశాల్లో ప్రస్తుత పరిస్థితులు, నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి వస్తాయని, ప్రభావం మాత్రం దశాబ్దాల పాటు కొనసాగుతుందని తెలిపారు.

Corona effect over decades: WHO
దశాబ్దాల పాటు కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్‌ఓ

By

Published : Aug 1, 2020, 11:13 AM IST

కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అంచనా వేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు అధికారులు. 18 మంది సభ్యులు, 12 మంది సలహాదారులు ఉన్న ఈ బృందం కరోనాపై సమీక్ష జరపడం ఇది నాలుగోసారి. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం, సామూహిక ప్రదేశాలను మూసివేయడం వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులు చేసింది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేసింది.

చైనా వెలుపల 100 కేసులు, అసలు మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితి(పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్‌సర్న్‌-పీహెచ్‌ఈఐసీ) ప్రకటించాల్సి వచ్చిందని అధనోమ్‌ గుర్తుచేశారు. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి వెలుగుచూస్తాయని.. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అయితే, అత్యయిక స్థితిని ఇదే స్థాయిలో ఇంకా కొనసాగిస్తారా అన్న అంశంపై మాత్రం పూర్తి స్పష్టత రాలేదు.

కరోనా విషయంలో శాస్త్రసంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని.. ఇంకా అనేక వాటికి సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇంకా చాలా మందికి వైరస్‌ ముప్పు పొంచి ఉందని.. ఇప్పటికే సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందన్నారు.

అక్కడ మళ్లీ విజృంభణ..

తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశాల్లో మరోసారి విజృంభిస్తోందని అధనోమ్‌ గుర్తుచేశారు. తొలినాళ్లలో పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు సైతం ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్ని దేశాలు మాత్రం వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయన్నారు.

పీహెచ్‌ఈఐసీని ప్రకటించడంలో సంస్థ జాప్యం చేసిందన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. చైనాతో జట్టుకట్టి కావాలనే కరోనాపై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ఆసల్యం చేసిందని అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలో సంస్థతో తీవ్రంగా విభేదించిన అమెరికా ఏకంగా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details