కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ వైరస్ బారినపడి మృత్యువాత పడ్డవారి సంఖ్య అమెరికా, స్పెయిన్, బ్రిటన్‌లో శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయింది. న్యూయార్క్‌లో మృతదేహాల ఖననానికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దేశాలన్నీ సర్వశక్తులు ఒడ్డుతూ ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. కొవిడ్-19 సోకిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 10.68 లక్షలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 56వేలను మించిపోయింది. అయితే ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి రాకపోవడం వల్ల వాస్తవ రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కరోనా కేసుల్లో నాలుగోవంతు.. అమెరికాలోనే ఉన్నాయి. ఇక్కడ 24 గంటల్లో మరణాల సంఖ్య వెయ్యి దాటిపోయింది. పెరిగిపోతున్న రోగులకు చికిత్స చేయడానికి ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నానా అవస్థ పడుతున్నారు. శుక్రవారం స్పెయిన్‌లో 900 మందికిపైగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 569 మంది చనిపోయిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది.
జర్మనీలో కొత్త ఇన్‌ఫెక్షన్ల రేటు తగ్గింది. దేశంలో మరోసారి ఈ వైరస్ కేసుల సంఖ్య పెరగకుండా చూసేందుకు పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని సింగపూర్ నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యలో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. మహమ్మారి తీవ్రస్థాయిలో కోరలు చాచిన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
ఇక్కడ కరోనా బాధితుల సంఖ్య 50వేలు దాటగా, మరణాలు 1500 మించిపోయాయి. దాదాపు 11 వేలమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నానాటికీ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మృతదేహాల ఖననానికీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శ్మశానవాటికల వద్ద రద్దీ బాగా పెరిగిపోయింది. వీటి నిర్వాహకులపై బాగా ఒత్తిడి పెరుగుతోంది. మృతుల బంధువుల నుంచి వారికి భారీగా ఫోన్లు వస్తున్నాయి. అయితే డిమాండ్‌ను తట్టుకోలేక నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. మృతదేహాలను సాధ్యమైనంత మేర ఆసుపత్రుల్లోనే ఉంచేందుకు ప్రయత్నించాలని వారు బంధువులకు సూచిస్తున్నారు. బ్రూక్లిన్‌లోని శ్మశానవాటికలో ఒకేసారి 40-60 మృతదేహాలను ఖననం చేయవచ్చు. అయితే గురువారం ఉదయం 185 మృతదేహాలు వచ్చాయి. దాదాపు 20 మృతదేహాలకు లేపనాలు పూసి ఎయిర్ కండిషనర్లలో భద్రపరచినట్లు బ్రూక్లిన్ శ్మశాన వాటిక నిర్వాహకుడు పాట్ మార్మో చెప్పారు.