క్లినికల్ టెస్టింగ్‌లో సంయుక్త భాగస్వామ్య విధానాలు, వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున తయారు చేసి పంపిణీ చేయడం వంటి అంశాలు కొవిడ్-19ను నివారించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ వ్యాక్సిన్ తయారీ విధానాలే 'సార్స్-సీఓవీ-2' నుంచి ప్రపంచ మానవాళిని కాపాడే అవకాశం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధిలో వ్యూహాత్మక సరళి పాటించడం ద్వారా ఒకేసారి పలు వ్యాక్సిన్ క్యాండిడెట్లను తయారు చేసేందుకు అవసరమైన సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ మేరకు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఎస్ కొలిన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంటోని ఫాచి, సీయాటెల్‌లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసర్చ్ సెంటర్ ప్రొఫెసర్ లారెన్స్ కోరే, ఎన్ఐఏఐడీ వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మాస్కోలా.. సైన్స్ జర్నల్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున తయారీ అవసరం
వివిధ వ్యాక్సిన్ విధానాల లక్షణాలు రూపొందించడానికి వ్యాక్సిన్ క్యాండిడేట్స్ కీలకంగా వ్యవహరిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ జనసమూహాన్ని కరోనా వైరస్ నుంచి రక్షించడానికి సురక్షితమైన వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున తయారుచేసి పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు.