అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య రెండో సంవాదంలో కరోనా అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బైడెన్.. ట్రంప్‌పై విమర్శల దాడికి దిగారు. ట్రంప్ ప్రభుత్వం వైఫల్యం వల్లే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ట్రంప్ మాత్రం ఈ విషయంలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
"చైనా నుంచి వచ్చిన ఈ కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనే కొన్నాళ్ల పాటు మూసివేశాం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య (కరోనా వైరస్) ప్రపంచం మొత్తం ఉంది. ఇదో ప్రపంచ మహమ్మారి. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారు. మనకు వ్యాక్సిన్ త్వరలోనే వస్తుంది. సిద్ధమవుతోంది. కొద్దివారాల్లో దీనిమీద ప్రకటన వస్తుంది. పంపిణీకి కూడా అన్ని సిద్ధం చేశాం. సైన్యం ఈ వ్యాక్సిన్ పంపిణీని నిర్వహిస్తుంది.”
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
బైడెన్ మాత్రం ట్రంప్‌పై విమర్శల దాడి కొనసాగించారు. కరోనాను ఎదుర్కోవడానికి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. కరోనా విషయంలో ట్రంప్ చాలా ఆలస్యంగా మేల్కొన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని ఆరోపించారు.