భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవార్థం అమెరికా కాంగ్రెస్లో వరుసగా రెండోసారి భారతీయ అమెరికన్ సభ్యుడు ఆర్ఓ ఖన్నా బుధవారం.. ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేడ్కర్ 130వ జయంతి సందర్బంగా.. ప్రపంచ దేశాల్లోని యువనేతలు ఆయన చూపించిన సమానత్వ మార్గం ద్వారా స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు.
"అందరికీ సమానమైన గౌరవం అని భావించే అమెరికా, భారత్ పక్షాన అంబేడ్కర్ పోరాడారు." అని అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆర్ఓ ఖన్నా ట్వీట్ చేశారు.
"అంబేడ్కర్ గౌరవార్థం నేను ఈరోజు మరోసారి.. తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువనేతలు అంబేడ్కర్ చూపించిన సమానత్వం మార్గం ద్వారా ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను. దళితుడైన అంబేడ్కర్ తనంతట తానుగా పైకి ఎదిగి, భారత రాజ్యాంగాన్ని రచించారు. దాని ద్వారా ఎంతో మంది భారతీయులు తమ హక్కులను కాపాడుకోగులుగుతున్నారు. అదే విధంగా.. నువ్వు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చావు? అనే దానితో సంబంధం లేకుండా.. ప్రతివ్యక్తి ఆ దేవుడు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయగలుగుతాడని మేం నమ్ముతాం."
-ఆర్ఓ ఖన్నా, అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు