తెలంగాణ

telangana

ETV Bharat / international

'హేట్​ క్రైమ్'​ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం

ఆసియా అమెరికన్లపై విద్వేషపూరిత నేరాలను అరికట్టే విధంగా రూపొందిన బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఈ బిల్లుపై గత నెలలోనే సెనేట్ ఆమోదముద్ర పడగా.. తాజాగా ప్రతినిధుల సభ గడప దాటింది. అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.

HATE CRIMES US CONGRESS
జాత్యహంకార వ్యతిరేక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

By

Published : May 19, 2021, 8:56 AM IST

ఆసియా అమెరికన్లపై దేశంలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. విద్వేషపూరిత నేరాలు, జాత్యహంకార చర్యలను అరికట్టే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఎగువసభ సెనేట్ గత ఏప్రిల్​లోనే ఈ బిల్లును 94-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. తాజాగా 364-62 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ గడప దాటింది.

ఈ బిల్లు ద్వారా ఆసియా అమెరికన్లపై జరుగుతున్న దాడుల నివారణ కోసం స్థానిక యంత్రాంగాలకు నిధులు సమకూరనున్నాయి. విద్వేషపూరిత నేరాలపై దర్యాప్తు చేసేందుకు, ఇలాంటి దాడులను గుర్తించేందుకు మరింత వెసులుబాటు కలగనుంది. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్​కు పంపనున్నారు. దీనిపై సంతకం చేస్తానని ఇప్పటికే బైడెన్ స్పష్టం చేశారు.

'మనసుల్లోని ద్వేషం మాపదుగా..'

ఈ బిల్లు ఆమోదం పట్ల చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో విద్వేషపూరిత ఘటనలు ఎదుర్కొన్నవారికి ఈ బిల్లు ద్వారా సంఘీభావం ప్రకటించినట్లైందని సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షూమర్ పేర్కొన్నారు.

ఈ బిల్లు ఆమోదించేందుకు ఉభయసభలు ఏకతాటిపైకి రావడం స్వాగతించదగినదని రిపబ్లికన్ ప్రతినిధి యంగ్ కిమ్ పేర్కొన్నారు. అయితే ప్రజల మనసుల్లో ఉన్న విద్వేషాన్ని ఈ బిల్లు రూపుమాపదన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు.

ఇదీ చదవండి:అమెరికాలో కాల్పులు-ఇద్దరు మహిళలు మృతి

ABOUT THE AUTHOR

...view details