అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉపశమన బిల్లుకు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లును.. తుది అనుమతి కోసం ప్రతినిధుల సభకు పంపగా.. అక్కడ 220-211 ఓట్ల తేడాతో గట్టెక్కింది. అద్భుతమైన మార్పును తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ గడపదాటిన ఈ బిల్లును బైడెన్ ఆమోదం కోసం పంపించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేస్తారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి తెలిపారు.
బైడెన్ విజయం
బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలపడం బైడెన్ ప్రభుత్వానికి భారీ విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. కరోనాతో పాటు ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికాను ఆదుకునేందుకు ఈ భారీ ప్యాకేజీ ఉపకరిస్తుందని చెబుతున్నారు. ప్యాకేజీ అమలులోకి వస్తే.. ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ప్రతి అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లను జమ చేస్తారు. నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున భృతి అందిస్తారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షల కోసం 50 బిలియన్ డాలర్లు కేటాయిస్తారు. రాష్ట్ర, స్థానిక, గిరిజన ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు 200 బిలియన్ డాలర్లను సాయం కింద అందిస్తారు.
ఇదీ చదవండి:భారత పర్యటనకు అమెరికా రక్షణ మంత్రి