తెలంగాణ

telangana

ETV Bharat / international

కాంతి సాయంతో కంప్యూటర్లు.. సరికొత్త ఆవిష్కరణ - computer working with sunlight

అమెరికాలోని హార్వర్డ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ కొత్త రకమైన కంప్యూటర్​ను రూపొందించారు. కాంతి పుంజాల నుంచి సమాచార మార్పిడి చేసేందుకు వీలు కల్పించే వినూత్న సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Computers with the aid of light .. the latest invention
కాంతి సాయంతో కంప్యూటర్లు.. సరికొత్త ఆవిష్కరణ

By

Published : Feb 5, 2020, 8:16 AM IST

Updated : Feb 29, 2020, 5:54 AM IST

కాంతి పుంజాలు 'తెలివి'గా సమాచార మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించే ఒక వినూత్న సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొత్త రకం కంప్యూటింగ్‌కు పునాదులు వేసిందని వారు చెప్పారు. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒకరకమైన హైడ్రోజెల్‌ను, కాంతి తీరుతెన్నుల్లో మార్పులు చేసేందుకు కెనడాలోని మెక్‌ మాస్టర్‌ వర్సిటీ రూపొందించిన కొన్ని విధానాలను తాజా పరిశోధనలో ఉపయోగించారు. ఈ రెండింటి సాయంతో జెల్లీ లాంటి, ఒకింత పారదర్శక పదార్థం సిద్ధమైంది. ఇందులో కాంతికి స్పందించే రేణువులు ఉన్నాయి. కాంతి పడినప్పుడు దీని నిర్మాణం మారుతుంది. ఫలితంగా దానికి ప్రత్యేక లక్షణాలు వస్తాయి.

సాధారణంగా.. కాంతి పుంజాలు ముందుకు వెళుతున్న కొద్దీ వాటి వెడల్పు పెరుగుతుంది. ఈ జెల్‌ మాత్రం తన గుండా వెళుతున్న సన్నటి లేజర్‌ కాంతి పుంజాన్ని ఒక నిర్దిష్ట మార్గంలోనే తీసుకెళ్లింది. ఒక గొట్టం గుండా వెళుతున్నట్లే ఇది ఉంది. వెంట్రుక కన్నా సన్నగా ఉన్న అనేక లేజర్‌ పుంజాలను ఈ పదార్థం గుండా ప్రసరింపచేసినప్పుడు అవి పరస్పరం తమ తీవ్రతను ప్రభావితం చేసుకున్నాయి. ఆ పుంజాలు భౌతికంగా ఎక్కడా కలవకపోయినప్పటికీ ఇలా జరగడం గమనార్హం. దీన్నిబట్టి సదరు జెల్‌ చాలా తెలివైందని స్పష్టమవుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కాంతి రేఖల మధ్య సంబంధాలను నియంత్రించవచ్చు. సర్క్యూట్‌ రహిత కంప్యూటింగ్‌కు ఇది మార్గం సుగమం చేస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న శరవణముత్తు చెప్పారు.

"ఈ పుంజాల మధ్య ఎడం ఉన్నప్పటికీ అవి పరస్పరం దర్శించుకోగలవు. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోగలవు. తెలివైన ఈ ప్రతిస్పందన వ్యవస్థను ఉపయోగించుకొని దీర్ఘకాలంలో కంప్యూటింగ్‌ ఆపరేషన్లను డిజైన్‌ చేయడం సాధ్యమే’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కంప్యూటర్లలో ఎలక్ట్రానిక్స్‌ను కాంతితో అనుసంధానించడానికి లోహపు వైర్లు, సెమీ కండక్టర్లు, ఫొటో డయోడ్లు ఉపయోగిస్తున్నారు. ‘‘పూర్తిగా కాంతితో కూడిన ఆప్టికల్‌ కంప్యూటింగ్‌ సాకారమైతే ఈ లోహపు భాగాల అవసరం ఉండదు. కాంతిని కాంతితోనే నియంత్రించొచ్చు. మృదువైన, సర్క్యూట్లు లేని, సూర్యకాంతితో పనిచేసే రోబో వంటివి తయారుచేయవచ్చు."

-శరవణముత్తు, పరిశోధకుడు

Last Updated : Feb 29, 2020, 5:54 AM IST

ABOUT THE AUTHOR

...view details