అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందని అక్కడి ఆస్పత్రుల నిర్వాహకులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఒక్క రోజులోనే 34 వేల 700 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో గరిష్ఠంగా ఒక్క రోజే 36 వేల 400 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
వైరస్ హాట్స్పాట్లుగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. అరిజోనా, కాలిఫోర్నియా, మిసిసిప్పి, నెవడా, టెక్సాస్‌లో రికార్డు స్థాయిలో బాధితులు పెరుగుతున్నారు. ఆస్పత్రులలో పడకలు ఖాళీలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది.
కరోనా మళ్లీ విజృంభిస్తుందనే భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పడిపోయాయి.
రికార్డు స్థాయిలో...
- ఫ్లోరిడాలో ఒక్క రోజే 5వేల500 కేసులు వెలుగుచూశాయి. గత వారం నమోదైన రికార్డు కంటే ఇది 25 శాతం అధికం. రెండు వారాల క్రితం రికార్డుతో పోల్చితే మూడు రెట్లు అధికం.
- మే 1 నుంచే లాక్డౌన్ ఆంక్షలు సడలించిన టెక్సాస్‌లో.. ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. కొత్త కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇక్కడ 8 ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 20 శాతం మందికి పాజిటివ్‌గా తేలుతోంది. మే మధ్యకాలంలో ఇది కేవలం 2 నుంచి 4 శాతం మాత్రమే ఉండేది.
- కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు న్యూయార్క్, న్యూ జెర్సీ ప్రకటించాయి.