కోకా ఆకుల కోసం గుమికూడిన జనం బొలీవియా రాజధాని లా పాజ్‌లో వందలాది కోకా ఉత్పత్తిదారులు ఒక్క చోట గుమికూడారు. వారు ఎంతో పవిత్రంగా భావించే కోకా ఆకులను ఇతరులతో పంచుకున్నారు. రాజధాని నగరాన్ని స్థాపించి 473 ఏళ్లు నిండిన క్రమంలో కోకా ఆకులు పంచుతూ సంబరపడ్డారు.
లా పాజ్‌లోని అనేకమంది రైతుల జీవనాధారం ఈ కోకా చెట్లు. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ ఇవి ఇంధనం వంటివి.
"ఈ కోకా ఆకులకు థాంక్స్ చెప్పాలి. మేము మా పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లగలుగుతున్నాము. వీటి వల్ల మా కడుపు నింపుకోగలుగుతున్నాం. మా కుటుంబాలను పోషించుకోగలుగుతున్నాము. అందుకే దీని ఆకులను మేము ఎంతో పవిత్రంగా చూసుకుంటాము. ఎన్నో తరాల వారు కోకా ఆకులు ఉపయోగించారు. మా పెద్దలు మాకిచ్చిన సంపద ఈ కోకా ఆకులు."
--- మిల్టన్ క్విస్బెట్, కోకా ఉత్పత్తిదారుడు.
ఈ కోకా ఆకులను తింటే శరీరానికి ఎక్కడలేనంత శక్తి లభిస్తుందని బొలీవియా ప్రజలు నమ్ముతారు. ఎక్కువ పనిగంటలున్న ప్రజలైతే.. ఒక్కోసారి ఏమీ తినకుండా, ఈ ఆకులను సేవించి రోజును గడిపేస్తారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే కారణంగా.. దానివల్ల కలిగే సైడ్ఎఫెక్ట్లను జయించేందుకు కూడా ఈ ఆకులను నములుతుంటారు.
"కోకా ఆకులు నమిలితే నిద్ర రాదు. చాలా శక్తి వస్తుంది. ఎక్కువ సేపు పనిచేయగలుతాము. ఎంతో ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. అందుకే ఈ కోకా ఆకులు చాలా ముఖ్యమైనవి."
-- సాంటియాగో గుటెరెజ్, కోకా ఉత్పత్తిదారుడు.
దేశవ్యాప్తంగా లక్షకుపైగా కోకా పొలాలు ఉన్నట్టు అంచనా. చట్టపరంగానే వీటిల్లో కోకాను పండిస్తారు. ఆకుల అమ్మకం, కొనుగోళ్లకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కోకా యూనియన్ల ఆధ్వర్యంలో ప్రత్యేక మార్కెట్లలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఇదీ చూడండి:-అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే- డ్రగ్స్ రవాణా కోసం...