వాతావరణం వేడెక్కుతోంది.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఎంతలా అంటే ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 50ఏళ్లలో మూడింట ఒక వంతు జంతు, వృక్ష జాతులు అంతరించి పోయేంతలా. అమెరికాకు చెందిన అరిజోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజా అధ్యయనంలో ఇదే అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 2070 నాటికి ఇప్పుడు చూస్తున్న జంతు, వృక్ష జాతుల్లో మనం మూడోవంతు వాటిని ఇక చూడలేమని నొక్కి చెబుతున్నారు. 581 ప్రాంతాల్లో.. ఒక్కోచోట 538 రకాల జంతు, వృక్ష జాతులపై పదేళ్ల పాటు 19 రకాల వాతావరణ పరిస్థితుల్లో పరిశోధకులు సర్వే జరిపారు. ఒకటి రెండు చోట్ల వీటిలో 44 శాతం జాతులు ఇప్పటికే అంతరించిపోయినట్లు గుర్తించారు.
పరిశోధన వివరాలివి..
వృక్ష, జంతు జాతులు అంతరించిపోవడం అనేది ఉష్ణోగ్రతలు ఎంతమేర పెరుగుతాయన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల జాతుల వేడిమిని తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితేనే 50 శాతం జాతులు అంతరించి పోయాయి. 2.9 డిగ్రీల సెల్సియస్ పెరిగిన ప్రాంతాల్లో 95 శాతం అంతరించి పోయాయి. పారిస్ ఒప్పందానికి కట్టుబడి మొత్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల లోపునకు పరిమితం చేయగలిగినా 2070 నాటికి పదింట 2 వంతున జంతు, వృక్షజాతులు అంతరించి పోతాయి.
సమ శీతోష్ణ ప్రాంతాల కంటే ఉష్ణ మండల ప్రాంతాల్లో 2 - 4 రెట్లు అధికంగా అంతరించిపోతున్నాయి. వాస్తవమేమంటే ఉష్ణ మండల ప్రాంతాల్లోనే అత్యధిక జంతు, వృక్ష జాతులున్నాయి.