కాలుష్యం కారణంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఈ మార్పులు భూమిపై మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. భూమి మసకబారిపోతోందని, గతంలో ఉన్నంత ప్రకాశవంతంగా లేదని తేలింది.
20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక చదరపు మీటర్‌కు సగం వాట్ తక్కువ కాంతిని భూమి ప్రతిబింబిస్తోందని.. అంటే దాదాపు 5శాతం వెలుగు తగ్గిపోయినట్లేనని వీరి అధ్యయనం పేర్కొంది. "గత 20 ఏళ్ల పాటు భూమి వెలుగులో ఎలాంటి మార్పు లేదు. గత మూడేళ్ల డేటా చూస్తే మాత్రం ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి" అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ గుడె తెలిపారు. భూమిపై వెలుగును సూర్యకాంతి ప్రభావితం చేస్తోంది. అయితే ఇందులో ఎలాంటి మార్పులు లేవు. వెలుగు తగ్గడానికి భూమిపై పరిస్థితులు.. ముఖ్యంగా సముద్రాలు వేడెక్కడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.