హింసాత్మకంగా వెనెజువెలా ఆందోళనలు విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్న వెనెజువెలా ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఓ వైపు ప్రతిపక్ష నేత జాన్ గుయాడో మద్దతుదారులు నిరసనలు చేపడుతుంటే.. మరోపక్క అధ్యక్షుడు నికోలస్ మదురో మద్దతుదారులు వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు. నగరంలోని కార్లోట కోట సమీపంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. మాస్క్లు ధరించిన కొందరు కోటవైపు రాళ్లు విసురుతూ నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. భద్రత బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి.