కరోనా వైరస్‌పై విజయం సాధించి, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జాతి వివక్ష నిర్మూలనలో పురోగతి సాధించినట్టు వెల్లడించారు. నిరుద్యోగం విషయంలో సానుకూల నివేదిక అందిందని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో శుక్రవారం చేసిన ప్రసంగంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్.
అమెరికావ్యాప్తంగా సామాజిక అస్థిరత్వం నెలకొంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం విషయంలో అమెరికన్లలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. మాన్మౌత్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్స్ ప్రకారం.. 10మంది ఓటర్లలో కేవలం ఇద్దరే దేశం సరైన దిశలో అడుగులు వేస్తోందని భావించారు. ఇన్ని క్లిష్టపరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అగ్రరాజ్యాన్ని మరో నాలుగేళ్ల పాటు పాలించేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సహా అన్ని ప్రతికూల అంశాలపై పట్టు సాధిస్తున్నట్టు వెల్లడించారు. అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు.
జాతి వివక్షపై...
ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో చెలరేగిన నిరసనలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని, జాతి వివక్ష నిర్మూలనలో మంచి పురోగతి సాధించినట్టు వివరించారు. సమానత్వం పరంగా దేశం సరైన మార్గంలోనే నడుస్తోందని ఫ్లాయిడ్ కూడా అనుకునే వాడని అభిప్రాయపడ్డారు.
అమెరికా చరిత్రలో మరే ఇతర అధ్యక్షులు చేయనంతగా.. నల్ల జాతి అమెరికన్ల అభివృద్ధికి తాను కృషి చేసినట్టు వివరించారు. జాతికి సంబంధించిన విషయాల్లో ఆర్థికపరంగా పుంజుకోవడమే అత్యంత గొప్ప విషయమన్నారు.
ఆ రిపోర్టుతో...