కరోనా విషయంలో చైనాపై మరోసారి నిప్పులు చెరిగారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రోజువారీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కరోనా సంక్షోభం విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేది లేదు. కరోనా వైరస్ వ్యాప్తిలో వారిదే బాధ్యత అని తేలితే తీవ్ర చర్యలు ఉంటాయి. 1917 తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చింది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మొదట్లో బాగానే ఉండేవాళ్లం..
మహమ్మారి వెలుగులోకి రాకముందు వరకు చైనాతో సత్సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు ట్రంప్. వైరస్ విజృంభణ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో తప్పకుండా భారీ తేడా ఉంటుందని స్పష్టం చేశారు. చైనాపై కోపంగా ఉన్నట్లు తెలిపారు.
వైరస్ వ్యాప్తి తొలిదశలో అమెరికా సాయం చేస్తామంటే కూడా చైనా నిరాకరించిందని పేర్కొన్నారు.
"మా సాయాన్ని వాళ్లు స్వీకరించి ఉండాల్సింది. వైరస్ గురించి వార్తలు వచ్చిన కొద్ది రోజులకే మేం సాయం చేస్తామని చెప్పాం. కానీ వాళ్లు వద్దన్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు.. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని. అందుకే వాళ్లు మా జోక్యాన్ని ఇష్టపడలేదు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్రత్యర్థిపై విమర్శలు..
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫు అభ్యర్థి జో బిడెన్‌కు చైనా మద్దతు ఇస్తోందని ఆరోపించారు ట్రంప్. ఇదే వేదికగా బిడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
చైనా మద్దతగా నిలుస్తున్న బిడెన్ గెలిస్తే అమెరికాను ఆ దేశం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు ట్రంప్. బిడెన్ వ్యాపార విధానాల వల్ల గతంలో ఆయన పాలకవర్గం చైనా నుంచి భారీ స్థాయిలో ప్రయోజనం పొందిందని విమర్శించారు.