అమెరికా.. అఫ్గానిస్థాన్‌ను వీడిన నేపథ్యంలో ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చూస్తోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ(Nikki haley on china) కూడా ఇటువంటి అనుమానమే వ్యక్తం చేశారు. ఆమె ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైనా భవిష్యత్తులో బగ్రామ్ వైమానిక స్థావరంలో(Bagram air force base) తిష్ఠ వేసే అవకాశం ఉందన్నారు. చైనాను ఓ కంట కనిపెట్టాలని అభిప్రాయపడ్డారు. తాము పోరాట పటిమ చూపకపోవడం వల్ల భవిష్యత్తులో రష్యా వంటి దేశాలు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. "వారు అఫ్గానిస్థాన్‌లోకి ప్రవేశించి పాక్ సాయంతో బలపడవచ్చు. ఆ తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయవచ్చు" అని నిక్కీ పేర్కొన్నారు.
అమెరికా సైబర్ నేరాలను ఎదుర్కొనేలా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని నిక్కీ సూచించారు. మిత్ర దేశాలతో కలిసి పనిచేయాలన్నారు. ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వారి వెనుక ఉందని ఆ దేశాలకు భరోసా ఇవ్వాలని బైడెన్‌కు సూచించారు.