బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా వారసుడి ఎంపికపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కుండబద్దలు కొట్టింది. దలైలామా వారసుడి ఎంపికలో డ్రాగన్ జోక్యం తగదని స్పష్టం చేసింది. బౌద్ధ మతానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం టిబెటన్ మత పెద్దలు మాత్రమే తీసుకుంటారని వెల్లడించింది. స్వేచ్ఛ, హక్కుల కోసం టిబెటన్లు చేసే పోరాటానికి ద్వై పాక్షిక సహకారం అందిస్తామని వివరించింది.
14వ దలైలామా వారసుడిని ఎన్నుకోవడానికి టిబెటన్లకు గల హక్కును అంగీకరిస్తూ సెనేట్‌లో ఇప్పటికే బిల్లును ఆమోదించిన అమెరిక మరోసారి చైనాకు గట్టి హెచ్చరికలు పంపింది. టిబెటన్ మతానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం ఆ మత పెద్దలు మాత్రమే తీసుకుంటారని ఇందులో డ్రాగన్ జోక్యం సరికాదని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి స్పష్టం చేశారు. చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా టిబెటన్ల తిరుగుబాటు జరిగి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
చైనాలో స్వేచ్ఛ పంచే వరకు విశ్రమించం
టిబెటన్ సంస్కృతిని, చరిత్రను నాశనం చేసేందుకు చైనా దశాబ్దాలుగా అసత్య ప్రచారం చేస్తోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. 62 ఏళ్ల క్రితం టిబెటన్లు తమ జీవన విధానాన్ని, సంస్కృతిని పరిరక్షించుకునేందుకు చైనాకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారని పెలోసి కొనియాడారు. టిబెటన్లకు అమెరికా అండగా ఉంటుందని వారి హక్కులు, స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి చేయూతనిస్తుందని ఆమె తెలిపారు. దలైలామా నుంచి పొందిన శాంతి, విశ్వాసం, ప్రేమను విశ్వవ్యాప్తం చేస్తామని పెలోసి వెల్లడించారు. దలైలామా స్ఫూర్తితో టిబెట్, చైనా అంతటా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాన్ని పంచే వరకూ విశ్రమించబోమన్నారు.
చైనాలో మానవ హక్కుల పరిరక్షణ కోసం నిలబడకపోతే ప్రపంచంలో మరే ప్రదేశంలోనూ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోతామని పెలోసి తెలిపారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా వారసత్వ ప్రక్రియలో చైనా ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండకూడదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది. టిబెట్‌లోని లాసాలో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, చైనా నియమావళి లేకుండా టిబెట్ బౌద్ధ సమాజం మాత్రమే దలైలామా వారసుడిని ఎంపిక చేసిందని నిర్ధారించేందుకు ఒక అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే పిలుపునిచ్చారు. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించబోమని, చైనాపై తీవ్ర ఆంక్షలు విధించే యోచన చేస్తామని ట్రంప్ అప్పట్లోనే తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ అంతర్గత వ్యవహరాల్లో జోక్యం తగదని అమెరికాకు తేల్చి చెప్పింది.
టిబెట్‌లోని స్థానికుల తిరుగుబాటుపై చైనా అణచివేత నేపథ్యంలో 1959 మార్చిలో 14వ దలైలామా నాటకీయంగా తప్పించుకొని భారత్‌కు చేరుకున్నారు. దలైలామాకు నెహ్రూ ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇచ్చింది. అప్పటినుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామా నివాసముంటున్నారు. దలైలామా టిబెటన్లకు అర్థవంతమైన స్వయం ప్రతిపత్తిని కోరుతున్నారు. దలైలామాను చైనా నుంచి టిబెట్‌ను విభజించేందుకు కృషి చేస్తున్న వేర్పాటువాదిగా డ్రాగన్ చూస్తోంది.
ఇదీ చూడండి:'చైనా.. ఈ శతాబ్దానికే అతిపెద్ద ప్రమాదకారి'