తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా కుటిల వ్యూహం: ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు! - Military and Security Developments Involving the People's Republic of China (PRC) 2020

సుదీర్ఘ వ్యూహంతో పనిచేస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీ .. జిన్​పింగ్‌ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు శరవేగంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకపక్క భారత్‌ వంటి భవిష్యత్తు పోటీదారులను ఇబ్బందులకు గురి చేస్తూ.. అగ్రరాజ్య హోదా కోసం పరితపిస్తోంది. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్, సరిహద్దు ఘర్షణలు, సైనిక స్థావరాల ఏర్పాట్లు వంటి అంశాలలో చైనా వైఖరిని బట్టబయలు చేసిన అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌.. భవిష్యత్తులో అమెరికాకు చైనా పెద్ద ప్రమాదకారి అని వెల్లడించింది.

China seeks to set up military logistic facilities in about a dozen countries: Pentagon
చైనా కుటిల వ్యూహం: ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు!

By

Published : Sep 2, 2020, 2:37 PM IST

అంతర్జాతీయంగా తన ప్రాబల్యాన్ని పెంపొందించుకునేందుకు డ్రాగన్‌ చేయని ప్రయత్నాలే లేవు. అన్ని మార్గాల్లో డ్రాగన్ దశ్చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో దేశాలను అప్పులు ఊబిలోకి దించి అవి తన మాట వినేలా చేసుకున్న చైనా... ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాల ఏర్పాటును వేగవంతం చేసింది.

ఈ స్థావరాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉండనున్నాయి. అయితే దక్షిణ ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న భారత్‌పై చైనా ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగానే దాయాది పాకిస్థాన్‌తో లేని అనుబంధాన్ని కొనసాగిస్తూ ముత్యాలసరం పేరుతో అష్టదిగ్భందం చేసేందుకు అడుగులు వేస్తుంది. కేవలం భారత్‌తోనే కాకుండా.. దక్షిణ, తూర్పు చైనా సముద్రంతో పాటు భూటాన్‌ వంటి దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని చైనా సృష్టిస్తోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ తెలిపింది. చైనా చర్యలు సరిహద్దు దేశాలనే కాక అగ్రరాజ్యం అమెరికాను సైతం కలవరపాటుకు గురిచేస్తున్నట్లు వెల్లడించింది.

చైనా ఏర్పాట్లు-అమెరికా ఆందోళనలు

అంతర్జాతీయంగా 12కు పైగా దేశాల్లో చైనా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుండగా... వాటిలో మూడు భారత పొరుగు దేశాలు కావడం గమనార్హం. వీటిలో పాకిస్థాన్‌, శ్రీలంక, మయన్మార్‌లున్నాయి. థాయ్‌లాండ్, సింగపూర్‌, ఇండోనేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సహా కెన్యా, అంగోలా తదితర మారుమూల దేశాల్లో మౌలిక వసతుల కల్పన చేసుకుంటూ సుదూర ప్రాంతాలకు తన సైనిక బలగాలని చైనా తరలిస్తోంది. తూర్పు ఆఫ్రికాదేశమైన జిబౌటీలోని సైనిక స్థావరంలో సరికొత్త సదుపాయాలు కల్పిస్తోంది. దీనిని ఆర్మీ, వాయు, నౌకాదళాలు వినియోగించేందుకు అనుకూలంగా అదనపు ఏర్పాట్లు చేస్తోంది. సైనిక స్థావరాల ఏర్పట్లను నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా... చైనా చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో అమెరికా దళాల ఆపరేషన్లకు ఆటంకం కలిగించడంతో పాటు వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా ప్రమాదకరంగా పనిచేసేందుకు వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారత్​కు ఇబ్బంది కలిగించేలా...

ప్రపంచ వాణిజ్యాన్ని సులభంగా చేజిక్కించుకునేందుకు చైనా రూపొందించిన మరో కార్యక్రమం వన్‌ బెల్ట్‌ వన్​ రోడ్. దీనిలోనూ భారత్‌కు ఇబ్బందులు కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇది పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం గుండా సాగి.. పాక్‌లోని గ్వాదర్‌ పోర్టు దగ్గర ముగియనుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత భూభాగమని, అందులో ఎటువంటి నిర్మాణాలను అంగీకరించమని భారత్‌ తేల్చి చెప్పింది. కానీ చైనా ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. అంతటితో ఆగకుండా సరిహద్దుల్లో లేనిపోని వివాదాలు సృష్టించి తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అందరికోసం వినియోగిస్తుందా?

చిన్న చిన్న దేశాలపై ఇప్పటికే బలప్రయోగం చేసిన డ్రాగన్‌ దేశం... హాంకాంగ్‌ వంటి దేశాలను పూర్తిగా హస్తగతం చేసుకుంది. ఇలా తన బలాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు సైనిక స్థావరాను ఏర్పాటు చేసుకుంటుంది. సైనిక సంఘర్షణలు, దౌత్యపరమైన సంబంధాలు, రాజకీయ మార్పులు, ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారం కోసం విదేశాల్లోని సైనిక స్థావరాలు వినియోగిస్తామని చైనా అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ చైనా చర్యలపై అమెరికా సైనిక విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత స్థావరాలు.. భవిష్యత్తులో అమెరికా సైనిక చర్యలపై రహస్య నిఘా వేసే అవకాశం ఉందని, అమెరికా ప్రత్యేక ఆపరేషన్లకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని.. అమెరికా సైనిక విభాగం అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details