UN sanctions on N Korea: అగ్రరాజ్యానికి హెచ్చరికలు చేస్తూ వరుస క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాపై కొరడా ఝులిపించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన ప్రతిపాదనకు చైనా, రష్యా మోకాలడ్డాయి. ఇటీవలి బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగానికి సంబంధించి ఐదుగురు ఉత్తర కొరియా అధికారులపై ఆంక్షలు విధించాలని ఐరాస భావించగా.. చైనా, రష్యా వ్యతిరేకించాయి.
US sanctions on North Korea:
కిమ్ దేశం చేపట్టిన క్షిపణి ప్రయోగాల్లో ఈ అధికారుల హస్తం కీలకంగా ఉందని ఐరాస భావిస్తోంది. గత రెండు వారాల వ్యవధిలో నాలుగు బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో.. ఈ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి గురువారం సమావేశం నిర్వహించింది. శాశ్వత, తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలకు ఆహ్వానం పంపింది.
North Korea Missile tests
ఉత్తర కొరియా చేపట్టిన చర్యలు భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ పేర్కొన్నారు. ఈ వ్యవహార తీరు అంతర్జాతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. పరిస్థితుల తీవ్రత తగ్గించేలా చర్చలకు రావాలని ఆ దేశానికి పిలుపునిచ్చారు.
అల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, యూఏఈ, యూకే దేశాలు అమెరికా తీర్మానానికి మద్దతిచ్చాయి. ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవడంలో భద్రతా మండలి సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నాయి.