ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా మహమ్మారిని ప్రపంచంపై వదిలి లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని ఆరోపించారు. ఈ సంక్షోభానికి చైనానే బాధ్యత వహించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
ఐరాస 75వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ట్రంప్ రికార్డ్ వీడియో ద్వారా ప్రసంగించారు.
"రెండో ప్రపంచ యుద్ధం ముగింపు, ఐరాస ఆవిర్భవించి 75 ఏళ్లు గడుస్తున్న సమయంలో ప్రపంచాన్ని మరో విపత్తు కమ్మేసింది. కంటికి కనిపించని శత్రువు- చైనా వైరస్‌తో భయంకర పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లో ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది.
ప్రపంచంపై మహమ్మారిని వదిలేసిన చైనానే ఈ విపత్తుకు జవాబుదారీని చేయాలి. వైరస్ ఆనవాళ్లు బయటపడినప్పుడు దేశీయ ప్రయాణాలను నిషేధించిన చైనా.. అంతర్జాతీయ విమానాలను వదిలేసింది. ఇది ప్రపంచానికి చేటు చేసింది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అంతకుముందు చైనాతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వైరస్‌పై తప్పుడు సమాచారం ఇచ్చారని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, కర్బన ఉద్ఘారాలు విషయంలోనూ చైనాపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
మాకు ఏ యుద్ధం వద్దు: జిన్‌పింగ్
ఇదే కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శాంతి మంత్రం జపించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, ప్రచ్ఛన్న లేదా ప్రత్యక్ష యుద్ధం.. ఏదీ తమకు అవసరం లేదన్నారు. దేశాల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.
"అభివృద్ధి చెందుతున్న దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధమైన అభివృద్ధికి కట్టుబడి ఉంది. చైనా ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదు. ఇతర దేశాలతో తమకు ఉన్న విభేదాలను తగ్గించుకుంటాం. సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటాం" జిన్‌పింగ్ వీడియో సందేశంలో ప్రకటించారు.
భారత్‌తో పాటు ఇతర సరిహద్దు దేశాలతో వివాదాల నెలకొన్న సమయంలో జిన్‌పింగ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కరోనా కేసులు