చైనా మిలిటరీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ దేశం ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
చైనా రక్షణ సామర్థ్యాలను పెంచడానికి అమెరికా మేధో సంపత్తిని దొంగిలించకుండా ఆపలేకపోయారని గత అగ్రరాజ్య పాలకులను తప్పుబట్టారు ట్రంప్. తనకన్నా ముందు పనిచేసిన అధ్యక్షులు ఏడాదికి 500 బిలియన్ డాలర్లకు పైగా చైనా దోచుకునేందుకు అనుమతించారని ఆరోపించారు. కానీ తాను అలా చేయటం లేదని ఉద్ఘాటించారు. ఆ సొమ్ము తీసుకునేందుకు చైనాను అనుమతిస్తే.. దానిని సైనిక విషయాలల్లో ఖర్చు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
" ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా చైనా రక్షణ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవటం వల్ల ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోంది. అందుకోసం అమెరికా డబ్బును చైనా వినియోగిస్తోంది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా బీజింగ్ తన సైనిక వ్యయాన్ని 7 శాతం వృద్ధితో 152 బిలియన్ డాలర్లకు పెంచుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.