అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హోరాహోరీగా తమ ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) రాబర్డ్ ఓబ్రెయిన్. చైనా, ఇరాన్, రష్యా కలిసి అమెరికా ఎన్నికలను నీరుగార్చాలని చూస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
"అమెరికాను రాజకీయంగా ప్రభావితం చేయడానికి చైనా ప్రణాళిక వేస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనితో పాటు ఇరాన్, రష్యా ఈ జాబితాలో ఉన్నాయి. మూడు దేశాలు కలిసి ఎన్నికలకు అంతరాయం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు బైడెన్ను కోరుకుంటున్నారు. మరికొంతమంది ట్రంప్వైపు ఉన్నామని చెబుతున్నారు. ఈ దేశాలకు కావాల్సింది ఏంటో తెలియట్లేదు. కానీ అమెరికాలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగకుండా అడ్డుకోవాలన్న ప్రయత్నాలను ఎవరైనా ఆపేయాల్సిందే"