తెలంగాణ

telangana

ETV Bharat / international

డ్రాగన్‌ పన్నిన రుణ ఉచ్చు సీపెక్‌

వివాదాస్పద చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాపై తీవ్ర ఆరోపణలు చేసింది అమెరికా. ఇది పాక్‌ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని, సార్వభౌమాధికారాన్ని కబళిస్తుందని హెచ్చరించింది. రుణ ఊబిలో కూరుకుపోవడం ఖాయమని స్పష్టంచేసింది. అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షించే ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఆలిస్‌ వెల్స్‌ సిపెక్​పై ఘాటుగా స్పందించారు.

డ్రాగన్‌ పన్నిన రుణ ఉచ్చు సీపెక్‌

By

Published : Nov 23, 2019, 7:14 AM IST

వివాదాస్పద చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)పై అమెరికా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. ఇది పాక్‌ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని, సార్వభౌమాధికారాన్ని కబళిస్తుందని హెచ్చరించింది. రుణ ఊబిలో కూరుకుపోవడం ఖాయమని స్పష్టంచేసింది. ఈ ప్రాజెక్టుపై చైనాకు ‘కఠిన ప్రశ్నలు’ సంధించాలని పాకిస్థాన్‌కు సూచించింది. అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షించే ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఆలిస్‌ వెల్స్‌ శుక్రవారం ఇక్కడ ఒక సదస్సులో సీపెక్‌పై ఘాటుగా స్పందించారు. ఆమె ప్రసంగ సారాంశమిదీ..

భరించలేని భారం..

పాక్‌లో మౌలిక వసతుల అవసరాలను తీర్చడం ద్వారా ఆ దేశాన్ని చైనాకు మరింత చేరువ చేయడం సీపెక్‌ ఉద్దేశం. అయితే ‘సీపెక్‌కు సంబంధం లేని ఇతర రుణ చెల్లింపులతో కలిపి పాక్‌ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకునేలా చైనా చేయబోతోంది. వచ్చే 4-6 ఏళ్లలో ఎక్కువ శాతం రుణ చెల్లింపులను పాక్‌ మొదలుపెట్టాల్సి ఉంటుంది. అవి పాక్‌ ఆర్థిక అభివృద్ధికి పెద్ద గుదిబండలా మారతాయి.

* ఇప్పటికే చైనా ప్రభుత్వానికి పాక్‌ 1500 కోట్ల డాలర్లు బకాయి పడింది. వాణిజ్యపరంగా ఆ దేశానికి మరో 670 కోట్ల డాలర్లు అప్పు పడింది. సీపెక్‌ అనేది సాయం చేయడానికి ఉద్దేశించింది కాదన్నది సుస్పష్టం.

ఇంత ధరా?

* సీపెక్‌లోని విద్యుత్‌, అభివృద్ధి ప్రాజెక్టుల ధరలు భారీగా పెంచేశారు. మోయలేని స్థాయిలో రుణాలు ఇచ్చి చైనా ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు లాభాలను ఆర్జించిపెట్టేలా సీపెక్‌ తయారవుతుంది.

* సీపెక్‌లో ఒక మెగావాట్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు స్థాపన వ్యయం సీపెక్‌ వెలుపల కన్నా రెట్టింపు ఉంది.

కార్మికులూ చైనా వారే..

* స్వదేశంలోని మిగులు కార్మికశక్తి, పెట్టుబడులు, ఉత్పాదక సామర్థ్యాలను ఎగుమతి చేసేలా ఓబీఓఆర్‌కు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో తాత్కాలికంగా చైనా తన సమస్యలను పరిష్కరించుకుంటోంది. విదేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఓబీఓఆర్‌లో చైనాకు చెందిన 95కుపైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి.

* సీపెక్‌లోనూ ప్రధానంగా పనిచేసేది చైనా కార్మికులే. ముడి సరకులూ అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. పాక్‌ కంపెనీలకు, కార్మికులకు అవకాశం ఇవ్వడంలేదు. చైనా ఉద్యోగులు పాక్‌లో ఆర్జించి, ఆ సొమ్మును చైనాకు తీసుకెళ్లిపోతున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, యువతకు ఒనగూరుతున్నది పెద్దగా ఏమీ లేదు.

పారదర్శకత లేదు

* ఓబీఓఆర్‌లో పారదర్శక రుణ విధానాలు కొరవడ్డాయి. దీనివల్ల ఖర్చు, అవినీతి పెరుగుతాయి. చెల్లింపుల్లో విఫలమైతే భరింపరాని రీతిలో రుణ భారం పెరిగిపోతుంది. దీనివల్ల ఆస్తులను అప్పగించాల్సి రావడం, సార్వభౌమాధికారాన్ని కొంతమేర కోల్పోవడం వంటివి జరుగుతాయి.

ఏకీభవిస్తున్నాం

ఓబీఓఆర్‌పై భారత వ్యతిరేకతకు ఆలిస్‌ మద్దతు తెలిపారు. అందులోని సీపెక్‌ ప్రాజెక్టు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళుతోందని, అది తన సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని మన దేశం అభ్యంతరం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఓబీఓఆర్‌ ప్రాజెక్టులోని భౌగోళిక రాజకీయ కోణాన్ని భారత్‌ మొదట్లోనే పసిగట్టింది. ఇందులో ఆర్థిక ప్రాతిపదిక ఏమీ లేదని, పైగా దీనివల్ల దేశం సార్వభౌమాధికారాన్ని కోల్పోతుందన్న భారత వాదనతో మేం ఏకీభవిస్తున్నాం’’ అని ఆలిస్‌ పేర్కొన్నారు.

ఏమిటీ సీపెక్‌?

ఆసియా, ఆఫ్రికా, చైనా, ఐరోపా మధ్య సంధానత, సహకారం కోసం ఓబీఓఆర్‌ ప్రాజెక్టును చైనా చేపట్టింది. ఇందులో భాగంగా ‘సీపెక్‌’ను తెరపైకి తెచ్చింది. చైనాలోని షిన్‌జియాంగ్‌ యుగుర్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని పాకిస్థాన్‌లోని వ్యూహాత్మక గ్వాదర్‌ రేవుతో అనుసంధానించడం దీని ఉద్దేశం. ఈ నడవాలో వందల కోట్ల డాలర్లతో రోడ్లు, రైల్వేలు, ఇంధన ప్రాజెక్టులను చైనా నిర్మిస్తుంది.

ఇదీ చూడండి:చిన్న రైతులు పెద్ద భరోసా...

ABOUT THE AUTHOR

...view details