వాస్తవాధీన రేఖ వెంబడి తమ వైపు చైనా చేపడుతున్న నిర్మాణాలపై ప్రముఖ భద్రతా కన్సల్టెన్సీ సంస్థ స్ట్రాట్‌ఫర్ విస్తృత నివేదికను వెల్లడించింది. 2017లో డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా తమవైపు సైనిక స్థావరాలను రెట్టింపు చేసిందని పేర్కొంది. ఈ ప్రతిష్టంభన తర్వాత చైనా 13నూతన సైనిక స్థావరాలను నిర్మించినట్లు వెల్లడించింది. వీటిలో 3 వైమానిక స్థావరాలు, 5 శాశ్వత ఎయిర్ డిఫెన్స్ పొజిషన్లు సహా ఐదు హెలీపోర్టులను నిర్మించినట్లు తెలిపింది. ఈ ఐదు హెలీపోర్టులలో 4 హెలీపోర్టులను తూర్పు లద్ధాఖ్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత నిర్మించినట్లు పేర్కొంది.
భారతసరిహద్దుల్లో చేపడుతున్న సైనిక నిర్మాణాలు చైనా ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నాయని స్ట్రాట్‌ఫర్ నివేదిక పేర్కొంది. 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను మార్చినట్లు వెల్లడించింది. దీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాల కోసం ఈ నిర్మాణాలను చేపడుతున్నట్లు అంచనా వేసింది. ఇటీవల భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు కొంత మేర ఉపశమనమేనని తెలిపింది. అయితే, భారత వైమానిక సామర్థ్యాన్ని పెంచేందుకు దేశీయంగా రక్షణ పరికరాల తయారీ, విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలు మరింత సమయం అవసరమని నివేదిక అభిప్రాయపడింది.