లద్ధాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా తన సైనిక బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యం... చైనా చేపడుతున్న చర్యలు శాంతిని భంగపరిచే విధంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
భారతదేశానికి చెందిన లద్ధాఖ్లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ త్సో సరస్సు వద్ద... చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. సరస్సులో అదనపు పడవలను తెస్తుంది. ఈ ప్రాంతంలో భారత్ అక్రమ సైనిక నిర్మాణాలు చేపడుతోందని చైనా ఆరోపిస్తోంది.
మే 5న ఇరుదేశాల సైనికులు తూర్పు లద్ధాఖ్‌లో ఘర్షణపడ్డారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని నకులా పాస్ వద్ద ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనల తరువాత చైనా దూకుడు పెంచింది. డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ తన సైనిక బలగాలను గణనీయంగా పెంచింది. దీటుగా స్పందించిన భారత్ కూడా ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది.
ఇండో చైనా సరిహద్దు వివాదాలు
భారత్- చైనాలు 3,488 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య అనేక సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లోని భాగమని చైనా వితండవాదం చేస్తూవస్తోంది.