అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న ఆయుధాలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తీవ్రవాద సంస్థలు చౌకగా దొరికే చిన్నపాటి మారణాయుధాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఐరాస తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్ వ్లాదిమిర్ వొరోంకోవ్ పేర్కొన్నారు. తేలికపాటి మారణాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి పోవడం వల్ల అంతర్జాతీయంగా శాంతి భద్రతలకు భంగం కలుగుతోందన్నారు.
"చిన్న, తేలికపాటి ఆయుధాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదు. సభ్యదేశాలు ఉగ్రవాదులను గుర్తించి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం పెను సవాలుగా మారింది. చిన్న ఆయుధాలు కావడం వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా తరలిస్తున్నారు."
-వ్లాదిమిర్ వొరోంకోవ్, తీవ్రవాద నిరోధక విభాగం చీఫ్