అఫ్గానిస్థాన్‌లో అధికార మార్పిడి చర్చల ద్వారానో, సమ్మిళితంగానో జరగలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (India at United Nations Security Council) భారత్ వ్యాఖ్యానించింది. విస్తృతమైన సమ్మిళిత విధానం అఫ్గాన్‌లో ఉండాలని భారత్ (India Afghanistan relations) కోరుకుంటోందని తెలిపింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ఇందులో ప్రాతినిథ్యం లభించాలని పేర్కొంది. (India at UNSC)
భద్రతా మండలిలో 'శాంతి స్థాపన' అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి బహిరంగ చర్చలో (UNSC discussion on Afghanistan) భారత్ తరపున మాట్లాడిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్.. అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ సమాజం ఏం కోరుకుంటోందన్న విషయం ఆగస్టులో రూపొందించిన తీర్మానంలో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. భద్రతా మండలికి భారత్ అధ్యక్షత (India UNSC Presidency) వహించిన నెలలోనే దీన్ని తీర్మానించినట్లు తెలిపారు. వీటిని గౌరవించి, కట్టుబడి ఉండాలని అఫ్గాన్ ప్రభుత్వానికి సూచించారు.
సంఘర్షణలు చెలరేగిన దేశంలో శాంతిస్థాపన కోసం అనేక సవాళ్లు ఎదురవుతాయని మురళీధరన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తు చేశారు. అయితే, సమీకృత విధానాల ద్వారా శాంతి స్థాపన చేసిన దేశాలు సైతం ఉన్నాయని చెప్పారు.
'ఉగ్రవాదం చట్టబద్ధంగా చూడొద్దు'
ఆఫ్రికాలో పెరిగిపోతున్న ఉగ్రవాదంపైనా (Terrorism in Africa) ఆందోళన వ్యక్తం చేశారు మురళీధరన్. ఉగ్రవాదులకు పొరుగు దేశాల నుంచి ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు వత్తాసు పలికి సమాజాలను విభజించాలని చూస్తున్నారని పలు దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ కారణాలతోనూ, ఏ పరిస్థితుల్లోనైనా ఉగ్రవాదాన్ని చట్టబద్ధ కార్యకలాపాలుగా చూడకూడదని స్పష్టం చేశారు.