ఊహాగానాలను నిజం చేస్తూ అధ్యక్ష ఎన్నికలకు ముందుగానే కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ట్రంప్ ప్రభుత్వం. నవంబర్ 1 నాటికి టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది ఫెడరల్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాల గవర్నర్లకు.. వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) చీఫ్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ లేఖ రాశారు.
"త్వరలోనే అన్ని రాష్ట్రాలకు మెక్కెస్సాన్ కార్పొరేషన్ నుంచి అనుమతులు లభిస్తాయి. టీకా పంపిణీ ఏర్పాట్లను వేగవంతం చేయడంలో మీ సాయాన్ని కోరుతోంది సీడీసీ. అవసరమైతే, 2020 నవంబర్ 1 నాటికి ఇవి పూర్తి కావాలి" అని రాబర్ట్ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు
అమెరికాలోని రాష్ట్రాలు, స్థానిక ఆరోగ్య విభాగాలు, ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీకి మెక్కెస్సాన్.. సీడీసీతో ఒప్పందం చేసుకుంది.
అక్టోబర్ చివరి వారంలో..
అంతేకాకుండా.. కొన్ని ఆరోగ్య శాఖలకు 3 ప్రణాళిక ప్రతులను పంపింది సీడీసీ. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు. వీటి ప్రకారం.. అక్టోబర్ చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
నవంబర్ మొదటి వారంలో పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అందివ్వనున్నట్లు సమాచారం. 2021 నుంచి సరఫరా పెంచనున్నట్లు ఈ ప్రతుల్లో ఉంది. తొలుత వచ్చే వ్యాక్సిన్లకు అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్‌డీఏ) లేదా ఏదైనా అత్యవసర అధికారాలున్న సంస్థ ఆమోదిస్తుందని పేర్కొంది.
నిపుణుల ఆందోళన..
అయితే, ఈ విషయంపై పలువురు ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయత కన్నా అధ్యక్ష ఎన్నికలే టీకా ఆమోదాన్ని నిర్ణయిస్తాయా అని ప్రశ్నించారు. అక్టోబర్ సర్ప్రైజ్ అంటే ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ రేసులో ట్రంప్‌పై పుతిన్ గెలిచారా?