అమెరికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటోంది. ప్రతిఏటా సంభవించే మరణాలతో పోలిస్తే ఈ ఏడాది కరోనా ప్రారంభమైన తర్వాత సాధారణం కన్నా మరో 3 లక్షల మంది వరకు అదనంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది దేశంలో సంభవించిన మరణాలపై నివేదిక రూపొందించింది వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ). గతంలో వివిధ సంవత్సరాల్లో నమోదైన మరణాల సంఖ్యతో పోల్చి చూసింది. ప్రతిఏటా సంభవించే మరణాల కన్నా ఈ ఏడాది కరోనా ప్రారంభమైన నుంచి ఫిబ్రవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 3 లక్షల వరకు అదనపు మరణాలు నమోదైనట్లు తేల్చింది సీడీసీ.
14.5 శాతం పెరుగుదల..
సాధారణంగా ప్రతిఏటా ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అమెరికాలో దాదాపు 19 లక్షల మరణాలు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 14.5 శాతం పెరిగింది. దాదాపు 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదనపు మరణాల్లో మూడింట రెండొంతుల మరణాలకు కరోనా వైరస్ కారణమైనట్లు తేలింది.
ఇతర మరణాల్లోనూ కరోనా ఒక కారణంగా ఉందని తెలిపారు సీడీఎస్ అధికారులు. గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి వెళితే అక్కడ కరోనా రోగులతో నిండిపోవటం వల్ల.. మరణానికి దారి తీసిన సందర్భాలు ఉన్నాయని ఉదహరించారు.
అదనపు మరణాల్లో అత్యధికంగా 95 వేల మంది 75-84 ఏళ్ల వయస్సులోనే ఉన్నట్లు వెల్లడించింది నివేదిక. అది సాధారణ ఏడాదితో పోలిస్తే 21.5 శాతం అధికమని తేల్చింది. అయితే.. 25-44 ఏళ్ల వయస్సు వారి మరణాలు 26.5 శాతం పెరుగాయి. మరోవైపు.. 25 ఏళ్లలోపు వారి మరణాల్లో తగ్గుదల నమోదవటం ఊరట కలిగించే విషయం. హిస్పానిక్ అమెరిక్లలోనే 54 శాతం మరణాలు సంభవించాయి.
ఇదీ చూడండి: కోపమొచ్చి.. ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్లిపోయిన ట్రంప్