US canada border: అమెరికా-కెనడా సరిహద్దులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీకా తప్పనిసరి నిబంధనను వ్యతిరేకిస్తూ కెనడాకు చెందిన ట్రక్కు, భారీ వాహనాలు, పికప్ డ్రైవర్లు ఐదు రోజులుగా నిరసనలు చేయడమే ఇందుకు కారణం. టీకా విధానాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా-కెనడా మధ్య అత్యంత రద్దీగా ఉండే అంబాసేడర్ వంతెనను దిగ్భంధించారు. దీంతో రెండు దేశాల మద్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్రనష్టం వాటిల్లుతోంది. ఈ బ్రిడ్జి ద్వారా ఇరు దేశాల మధ్య 328 మిలియన్ డాలర్లు విలువ చేసే సరకు రవాణా జరుగుతుంటుంది. ఇది రెండు దేశాల మొత్తం వాణిజ్యంలో 25శాతం కావడం గమనార్హం.
ఇరుదేశాల మధ్య రవాణా స్తంబించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోతో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని, శాంతి భద్రతలను పునరుద్ధరిస్తాని బైడెన్‌కు ట్రుడో హామీ ఇచ్చినట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.
మరోవైపు అంబాసేడర్ వంతెనపై ఐదు రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని అమెరికా కోర్టు జడ్జి ఆదేశించారు. సరకు రవాణా పునరుద్ధరించాలని సూచించారు. అయితే అధికారులు మాత్రం డ్రైవర్లు పార్క్ చేసిన ట్రక్కులు, ఇతర వాహనాలను తొలగించేందుకు ఇంకా చర్యలు చేపట్టలేదు.