టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ సోకితే.. అది దీర్ఘకాల కొవిడ్‌గా మారే అవకాశం ఉందా? అనే అంశంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి సమాధానం కనుగొనే విధంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
కరోనా టీకా తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. మరణించే ముప్పు కూడా తగ్గుతుంది. కానీ టీకా తీసుకున్న వారిలో కొందరికి వైరస్ తిరగబెడుతోంది. ఇలాంటి కేసుల్లో భయపడాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి ప్రమాదం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పరిణామాలు దీర్ఘకాల కొవిడ్‌కు దారి తీస్తాయా? అనే అంశంపై పరిశోధకులు ప్రస్తుతం దృష్టిసారించారు. ఒకసారి వైరస్ సోకిన నెల రోజులకు వ్యాధి మళ్లీ తిరగబెట్టినా, లక్షణాలు పదే పదే కనపడుతున్నా దానిని దీర్ఘకాల కొవిడ్ అంటారు.
టీకా తీసుకోని 30శాతం మందిలో దీర్ఘకాల లక్షణాలు బయటపడుతున్నాయని కొన్ని పరిశోధనలు అంచనా వేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, ఒకదానిపై శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయి.
ఆరోగ్య కార్యకర్తల్లో ఈ లాంగ్ కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. వారిలో దగ్గు, నీరసం వంటి లక్షణాలు దాదాపు ఆరు వారాలపాటు ఉన్నట్లు పేర్కొంది.
అయితే ఇలా ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినడం సహా ఇతర అవయవాలపై ప్రభావం పడటం ఇందుకు ఓ కారణంగా పలువురు పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకొందరు.. వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే బయటకు వెళ్లదని, అందువల్ల రోగ నిరోధక శక్తితో పోరాటం కారణంగా లక్షణాలు బయటకు వస్తుంటాయని అభిప్రాయపడుతున్నారు.
రోగ నిరోధక శక్తికి దన్ను..
కరోనా సోకిన వారు కూడా టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు ఇప్పటికే అనేకమార్లు సూచించారు. వీరి మాటలకు బలం చేకూరుస్తూ తాజాగా ఓ అధ్యయనం బయటకు వచ్చింది. కొవిడ్ నుంచి కోలుకుని, టీకా తీసుకోకపోతే.. వారికి మళ్లీ వైరస్ సోకే ముప్పు రెండింతలని పేర్కొంది. అదే సమయంలో టీకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కొత్త వేరియంట్లపైనా రక్షణ కలుగుతుందని అమెరికా సీడీసీ(రోగ నిరోధక నివారణ కేంద్రం) చేసిన అధ్యయంలో నిపుణులు వెల్లడించారు.
"టీకా పొందని వారికి రీ ఇన్‌ఫెక్షన్ ముప్పు 2.34 రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. అందువల్ల గతంలో కొవిడ్ బారినపడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి" అని సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్‌స్కీ తెలిపారు. డెల్టా రకం కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇది అవసరమని చెప్పారు. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లలో దీని వాటా 83 శాతం మేర ఉందని వివరించారు. ముప్పు ఎక్కువగా ఉండే వయోధికులు కొవిడ్‌తో ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలో టీకాలు సమర్థతను చాటాయని కూడా తెలిపారు. ఫ్లూ టీకాల కన్నా మెరుగ్గా ఇవి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-చిన్నారుల్లో దీర్ఘకాల కరోనా లక్షణాలు తక్కువే!