అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. దావానలం ధాటికి నష్టాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా సంభవించిన ఆగస్ట్ కాంప్లెక్స్ కార్చిచ్చుతో 10 లక్షల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ఏడాదిలో కార్చిచ్చుల కారణంగా మొత్తం 40 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిబుడిదయిందని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసొమ్ తెలిపారు.
"1932 నుంచి 1999 మధ్య కార్చిచ్చుల వల్ల కలిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం... తాజాగా సంభవించిన ఆగస్ట్ కాంప్లెక్స్ కార్చిచ్చు వల్ల జరిగింది. దీని ధాటికి మొత్తం 31 మంది మృతిచెందగా.. 8,700 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ మంటలకు వాతావరణ మార్పులే కారణం కావచ్చు."
- గావిన్ న్యూసొమ్, కాలిఫోర్నియా గవర్నర్
మొత్తం 40 లక్షల ఎకరాలు...
ఆగస్టు మధ్యలో మెండోసినో నేషనల్ ఫారెస్ట్‌లో మొదలైన కార్చిచ్చు.. సెప్టెంబర్ నాటికి పెద్దఎత్తున విస్తరించింది. సోమవారం నాటికి 4,055 కి.మీ. మేర అడవులు దగ్ధమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కాలిఫోర్నియా వ్యాప్తంగా.. 8,200లకు పైగా కార్చిచ్చులు ఏర్పడ్డాయి. 40 లక్షలకుపైగా ఎకరాల అడవులు దగ్ధమయ్యాయని కాలిఫోర్నియాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ తెలిపింది.