కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ (California Governor Gavin Newsom) తన పదవిని కాపాడుకున్నారు. గవర్నర్ పదవి నుంచి దింపేసేందుకు జరిగిన ప్రయత్నాల నుంచి విజయవంతంగా గట్టెక్కారు. అమెరికా చరిత్రలో 'రీకాల్'ను (California recall) తప్పించుకున్న రెండో గవర్నర్గా రికార్డుకెక్కారు.
ఈ మేరకు కాలిఫోర్నియాలో నిర్వహించిన రీకాల్ ఎన్నికల్లో (California recall election) ఘన విజయం సాధించారు. 60 శాతం బ్యాలెట్లను లెక్కించగా.. మూడింట రెండొంతుల మంది ఓటర్లు న్యూసమ్ను గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు విముఖత చూపించారు.
ఈ విజయంతో డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు న్యూసమ్. తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలను మెరుగుపర్చుకున్నారు.