అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అంధకారంలో చిక్కుకుంది. అత్యంత వేగంతో వీస్తున్న వేడి గాలుల కారణంగా పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంస్థ(పీజీ అండ్ ఈ) విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. విద్యుత్ తీగల వల్ల మరిన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ అంతరాయం కారణంగా అనేక ఇళ్లు, వాణిజ్య కేంద్రాలు చీకటిగా మారాయి. ఉత్తర కాలిఫోర్నియా పరిధిలోని లక్షలాది మంది.. విద్యుత్ వాహనాలు, చరవాణిల ఛార్జింగ్ కోసం విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"నేను ప్రభుత్వ చర్యలపై నిరాశ చెందాను. విద్యుత్ అంతరాయం కలిగించినందుకు ఈ మొత్తం పాలన మీద నాకు అసంతృప్తిగా ఉంది. కచ్చితంగా ఇదంతా కావాలని చేసే పని. దేశంలో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంటే ఇలాగే జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా సరే ఇలాగే ఉంటుంది."
-గెరాల్డ్ ష్మావోనియన్, గీజర్విల్ వాసి
తూర్పు శాన్ఫ్రాన్సిస్కోలోని లాఫాయెట్ టెన్నిస్ క్లబ్‌ను కార్చిచ్చు దహించివేసింది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వారంతా మంగళవారం చీకటిలోనే గడపాల్సి వచ్చింది.
స్టార్లనూ తాకిన కార్చిచ్చు
మంటల ఉద్ధృతి కారణంగా లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రముఖ బాస్కెట్‌బాల్ ఆటగాడు స్టార్ లెబ్రాస్ జేమ్స్ సహా ప్రముఖలను ఆ ప్రాంతం నుంచి తరలించారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అగ్నిమాపక సిబ్బంది కోసం 5లక్షల డాలర్లు విరాళం ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.