కరోనా సంక్షోభం కారణంగా 2021 నాటికి సుమారు 15కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. వైరస్ విజృంభణతో.. ఈ ఏడాదిలో 8.8 కోట్ల నుంచి 11.5 కోట్ల మంది ప్రజలు అదనంగా పేదరికం బారిన పడతారని అభిప్రాయపడింది ప్రపంచ బ్యాంకు. 2021 ఏడాదిలో ఈ సంఖ్య 15 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
2021 నాటికి కడు పేదరికంలో 15 కోట్ల మంది! - ప్రపంచ బ్యాంకు అంచనాలు
కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా వచ్చే ఏడాది నాటికి సుమారు 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలో కూరుకుపోయే అవకాశముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీని నుంచి గట్టెక్కేందుకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధికి సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ఇందుకోసం వ్యాపార రంగాల్లో నూతన ఆవిష్కరణలు అవసరమని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో కరోనా అనంతరం ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థల్లో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని చెప్పింది. మూలధనం, శ్రమ, నైపుణ్యాలను వినియోగించి వ్యాపార, వాణిజ్య రంగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించింది. ఇప్పటికే పేదరికంతో ఉన్న దేశాల్లో మరింత మంది ప్రజలు పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. అదే విధంగా మధ్య ఆదాయ దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన చేరనున్నట్లు అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1.4 శాతానికిపైగా ప్రజలు కడు పేదరికంలోకి కూరుకుపోనున్నట్లు వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది.
ఇదీ చదవండి:పేదరికంలో కూరుకుపోయిన 135 కోట్ల మంది బాలలు!