తెలంగాణ

telangana

ETV Bharat / international

బుల్లెట్​ ప్రూఫ్​ బ్యాగులు వాడుతున్న బడిపిల్లలు

అమెరికాలో గర్జిస్తున్న తుపాకీ ఎంతో మంది చిన్నారులను బలి తీసుకుంది. పాఠశాలల్లోనూ విచక్షణా రహితంగా జరుగుతున్న కాల్పుల్లో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు బుల్లెట్‌ ప్రూఫ్‌ స్కూల్‌ బ్యాగులను ఆశ్రయిస్తున్నారు. వీటి అమ్మకాలు గతంలో కంటే  రెట్టింపవ్వడం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.

బుల్లెట్​ ప్రూఫ్​ బ్యాగులు

By

Published : Aug 13, 2019, 12:03 PM IST

Updated : Sep 26, 2019, 8:33 PM IST

అమెరికాలో పిల్లల రక్షణకు బుల్లెట్​ ప్రూఫ్​ బ్యాగులు

గతకొద్ది రోజులుగా అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు, ప్రజలు గుమిగూడిన ప్రాంతాల్లో జరుగుతున్న తుపాకీ దాడులు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు సైతం తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే బుల్లెట్‌ ప్రూఫ్‌ స్కూల్‌ బ్యాగుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి అమ్మకాలు గతంలో కంటే రెట్టింపవ్వడం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.

చిన్నారులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ బ్యాగు వేసి పాఠశాలకు పంపాల్సి రావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన పాఠశాలల్లోనూ తుపాకీలు గర్జిస్తుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

" ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ బ్యాగ్‌ కొనడానికి వచ్చాను. దీన్ని బట్టే మనం నేడు ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. బ్యాగ్‌ను కొనేందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు సిద్ధమై వచ్చాను. బ్యాగు కొనేంత ఆర్థిక స్తోమత ప్రస్తుతం నాకు లేదు. కానీ ఇప్పుడు సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బ్యాగు కొనాల్సివస్తోంది. తల్లిగా నా చిన్నారిని రక్షించుకునేందుకు అధిక సమయం పనిచేసి బ్యాగును కొంటాను."
- మరిసోల్‌ రోడ్రిగజ్‌, విద్యార్థి తల్లి

బ్యాక్-టు-స్కూల్ షాపింగ్ సీజన్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ బ్యాగ్‌లకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. కానీ ఈ బ్యాగు ధర ఎక్కువగా ఉండడం వల్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో బ్యాగు 9 వేల రూపాయల నుంచి 11 వేల రూపాయల మధ్య లభిస్తుంది. తల్లిదండ్రుల భయాలను ఆసరాగా చేసుకొని బ్యాగు తయారీ కంపెనీలు దోచుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ బ్యాగుల నాణ్యతపైనా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్‌ బ్యాగులు సమస్యకు పరిష్కారం కాదని మూలాలకు వెళ్లి తుపాకీ సంస్కృతిని నివారించాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.

బుల్లెట్ బ్యాక్‌ ప్యాక్‌ తయారీదారులు మాత్రం వీటి నాణ్యతపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక ప్రాంతంలో తరచూ కాల్పులు జరుగుతున్న పరిస్థితుల్లో వీటి అవసరం ఉందంటున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ బ్యాక్‌ ప్యాక్‌లను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇక అమెరికా పౌరసత్వం పొందటం కష్టమే..!

Last Updated : Sep 26, 2019, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details