తెలంగాణ

telangana

ETV Bharat / international

జంతువులనూ వదలని వైరస్​.. పులికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్ మూగజీవాలను కూడా వదలటం లేదు. తాజాగా న్యూయార్క్‌ బ్రాంగ్జ్‌ జూపార్క్‌లో ఓ పులికి కరోనా వైరస్‌ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాకుండా పార్క్‌లోని ఇతర జీవాలకు కూడా వైరస్‌ లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు.

Bronx zoo tiger tests positive for coronavirus
ఈ పులికి కూడా కరోనా వైరస్‌

By

Published : Apr 6, 2020, 11:12 AM IST

అమెరికాలో కరోనా వైరస్ మనుషులనే కాదు అక్కడి జంతువులను కూడా వదలట్లేదు. తాజాగా న్యూయార్క్‌ బ్రాంగ్జ్‌ జూపార్క్‌లో ఓ పులికి కరోనా వైరస్‌ సోకింది. ఆ జూలో ఉండే నదియా అనే నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిందని జూ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ పులి బాగోగులు చూసుకునే వ్యక్తి నుంచే దానికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని చెప్పింది. నదియా చెల్లి అజుల్‌ అనే పులితో పాటు మరో మూడు ఆఫ్రికా సింహాలూ వైరస్‌ లక్షణాలతో కనిపిస్తున్నాయని పేర్కొంది. త్వరలోనే అవన్నీ కోలుకుంటాయని న్యూయార్క్‌లోని జూపార్క్‌లను పర్యవేక్షించే వైల్డ్‌లైఫ్‌ కంజర్వేషన్‌ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఎంతో ప్రయాసకోర్చి ఆ పులికి కరోనా పరీక్షలు జరిపించామని, ఇకపై దీనికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే ప్రజలకు తెలుపుతామని ఆ సంస్థ స్పష్టంచేసింది. ప్రస్తుతం అవి ఆరోగ్యంగానే ఉన్నాయని, వెటర్నరీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్న వాటికి ఆకలి కొంచెం మందగించడం మినహా అంతా బాగానే ఉన్నాయని తెలిపింది. ‘జంతువుల్లో వైరస్‌ ఎలా వృద్ధి చెందుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు, ఒక్కో జీవిపై ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది. నిరంతరం వాటిని మానిటరింగ్‌ చేస్తున్నాము. వాటితో పాటు వాటి సంరక్షకులకు సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని ఆ సంస్థ వివరించింది.

మరోవైపు జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ వ్యాపిస్తుందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని జూ నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికాలోనూ ఎక్కడా పెంపుడు జంతువులతో వైరస్‌ వ్యాపించిందనే కేసులు నమోదు కాలేదని స్పష్టంచేశారు. అమెరికా వ్యవసాయ విభాగంలోని వెబ్‌సైట్‌ ప్రకారం.. ఆ దేశంలో పెంపుడు జంతువులు వైరస్ బారిన పడినట్లు ఎక్కడా ఆనవాలు లేదు. న్యూయార్క్‌ జూపార్క్‌లోని నదియా పులిదే తొలి కేసు. అయినా, ప్రజలు ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని అందులో సూచించారు. కాగా, మార్చి నెలాఖరులో బెల్జియంలో ఓ పెంపుడు పిల్లి వైరస్‌ బారిన పడిందని సమాచారం. అలాగే హాంకాంగ్‌లోనూ రెండు శనకాలకు కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. వీటన్నింటికీ తమ సంరక్షకుల నుంచే వైరస్‌ వ్యాపించిందని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details