తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఐరాసలో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలి' - brics leaders on un reforms

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరమని బ్రిక్స్ దేశాల కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్​)తో సహా ఇతర సంస్థలను బలపేతం చేయడానికి సంస్కరణలు అత్యవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు బ్రిక్స్ కూటమి నేతలు సంయుక్త ప్రకటన చేశారు.

'ఐరాసలో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలి'

By

Published : Nov 15, 2019, 6:07 AM IST

Updated : Nov 15, 2019, 6:37 AM IST

బ్రిక్స్ దేశాల 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అత్యవసరమని కూటమి దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. దేశాల మధ్య సహకారం, శాంతిభద్రతల పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి దిశగా ముందుచూపు, మానవహక్కులకు రక్షణ కల్పించడం వంటి సూత్రాలను పాటిస్తూ బ్రిక్స్ దేశాలు.. అంతర్జాతీయ సమాజ భవిష్యత్తు ఉజ్వలంగా సాగేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించారు.

బహుళ ధ్రువ దేశాలకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం, ప్రపంచ వ్యవహారాల్లో ఐరాసకు పాత్రకు మద్దతు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం ద్వారా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.

"బహుళ ధ్రువ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఐరాస, డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్​ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంస్కరణలు మరింత ప్రజాస్వామ్యయుతంగా, అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తూ.. అంతర్జాతీయ నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. మార్కెట్లకు మరింత అవకాశం కల్పించేవిగా ఉండాలి."

-బ్రిక్స్ నేతల ప్రకటన

న్యాయం, సమానత్వంతో కూడిన.. అందరికీ అవకాశం కల్పించే బహుళ ధ్రువ ప్రపంచ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సభ్యదేశాలన్నింటితో కలిసి నడవాలని.. అందరి ఆసక్తులను నెరవేర్చాలని వెల్లడించారు.

2005 నాటి ప్రపంచ సదస్సు తీర్మానాల ప్రకారం ఐరాసలో సమగ్ర సంస్కరణలు రావాలన్నారు. ప్రపంచ సమస్యలకు సమాధానం కల్పించే దిశగా భద్రతా మండలి సహా ఐరాసలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.

ఐఎంఎఫ్​ కేటాయింపులపై అసంతృప్తి..

వివిధ దేశాల నుంచి కోటా ఆధారంగా వనరులను సమకూర్చడం ద్వారా.. ప్రపంచానికి ఆర్థిక భద్రత కల్పించే అత్యంత బలమైన అంతర్జాతీయ ద్రవ్యనిధిపై తమ విశ్వాసాన్ని బ్రిక్స్ నేతలు వ్యక్తం చేశారు. అయితే ఐఎంఎఫ్ 15వ కోటా సమీక్షపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాలు సమకూర్చే కోటాకు అనుగుణంగా నిధుల కేటాయింపు లేకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

'వ్యాపార ఆంక్షలు సరికాదు'

అగ్రరాజ్యం అమెరికా వైఖరిపై బ్రిక్స్ కూటమి అసంతృప్తి వ్యక్తం చేసింది. టారిఫ్​లు విధించడంలో ఏకపక్ష ధోరణి సరికాదంటూ ఆక్షేపించింది. బహుళ ధ్రువ ప్రపంచానికి వ్యాపార ఆంక్షలు సమస్యగా పరిణమించాయని వ్యాఖ్యానించింది. వాణిజ్య ఆంక్షలపై బ్రిక్స్ తీర్మానాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో ప్రకటించారు.

"వాణిజ్యపరమైన ఆందోళనలు.. విధానాల్లో అస్థిరత్వం ప్రపంచ ఆర్థిక రంగంలో ఆత్మవిశ్వాసాన్ని, వ్యాపారాలను, పెట్టుబడులను, వృద్ధిని నష్టపరుస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) సభ్యులందరూ ఏకపక్షంగా, వ్యాపార ఆంక్షలను నివారించాలి."

-జైర్​ బొల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు

ఇదీ చూడండి: అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

Last Updated : Nov 15, 2019, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details