Breakthrough infections: కొవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్లతో సవాళ్లు విసురుతుంటే.. మరోవైపు శాస్త్రవేత్తల పరిశోధనలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారికి విరుగుడని ప్రపంచ దేశాలు భావిస్తుండగా.. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కొందరు కొవిడ్ బారిన పడడం (బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లు) ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇలా బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడడం వల్ల భవిష్యత్‌లో రాబోయే వేరియంట్లను సైతం ఎదుర్కొనే విధంగా మానవ శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనలు వృద్ధి చెందుతాయని ఓ పరిశోధనలో తేలింది. డెల్టా వేరియంట్‌పై నిర్వహించిన ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా)లో ప్రచురితమైంది.
వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడినప్పుడు వ్యాధి నిరోధక ప్రతి స్పందన వేగంగా వృద్ధి చెంది, సార్స్‌కోవ్-2 ఇతర మ్యుటేషన్లను సైతం ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని అమెరికాకు చెందిన ఒరిజాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయనంలో పాలుపంచుకున్న పికాడు టఫెస్సే పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్నాక కొవిడ్ బారిన పడిన వారి నుంచి తీసుకున్న రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనలను గుర్తించినట్లు తెలిపారు.