భారత్ బయోటెక్‌తో కొవిడ్ టీకాల ఒప్పందంలో బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలకు సంబంధించి అధ్యక్షుడు బొల్సొనారో పాత్రపై నేర పరిశోధనకు ఆ దేశ సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జస్టిస్ రోసా వెబెర్ తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. కరోనాను ప్రభుత్వం ఎదుర్కొన్న తీరుపై ఇటీవల సెనేట్ కమిటీ జరిపిన విచారణ ఈ పరిశోధనకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కేసులో బోల్సొనారో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాస్తవాలు దాచి, నిందితులపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడ్డరా అనే విషయం విచారణలో తేలుతుందని తెలిపారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని దిగుమతుల విభాగం ముఖ్య అధికారి లూయిస్ రికార్డో మిరందా ఇటీవల మాట్లాడుతూ.. భారత్ నుంచి రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులు దిగుమతికి సంబంధించిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే సమయంలో తాను విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్టు చెప్పడం పై పరిణామానికి దారి తీసింది.