కరోనా మరణాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైన దేశంగా బ్రెజిల్ నిలిచింది. బ్రెజిల్‌లో మహమ్మారి ధాటికి చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది.
కరోనా మరణాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్స్‌నారో.. లాక్‌డౌన్ మాత్రం విధించేది లేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ దిశగా వెళ్తే దేశంలో ఆందోళనలు చెలరేగుతాయని ఆయన అన్నారు. కరోనా విసిరే దారుణమైన సవాళ్లకు కూడా సిద్ధంగా ఉండాలని ప్రజలకు బోల్స్‌నారో సూచించారు.
రోజువారీ మరణాలు బ్రెజిల్‌లో పెరిగిపోగా.. అంత్యక్రియల్లో పారిశుద్ధ్య కార్మికులు తీరికలేకుండా గడుపుతున్నారు. ఆస్పత్రులు కూడా రోగులతో నిండిపోయాయి. ఐసీయూ వార్డుల్లో ఖాళీలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ చివరి నాటికి బ్రెజిల్ జనాభాలో సగం మందికి టీకా ఇవ్వడం పూర్తవుతుందని.. కరోనా కూడా నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏ టీకాకు కూడా బ్రెజిల్ ఔషధనియంత్రణ సంస్థలు పచ్చజెండా ఊపలేదు.
'క్యాపిటల్'పై దాడి రోజున భారీగా మరణాలు..
అమెరికాలోని కాలిఫోర్నియా కరోనా ధాటికి అల్లాడుతోంది. కొద్దినెలలుగా వైరస్ మరణాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ థ్యాంక్స్ గివింగ్ వేడుకల వల్ల ఈ వైరస్ బాధితుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన రోజున అక్కడ దాదాపు 3,900 కరోనా మరణాలు నమోదయ్యాయి.
అమెరికాలో ఇప్పటివరకు 3,61,453 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.