ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.75కోట్ల మందికి కరోనా సోకింది. 10.78లక్షల మంది వైరస్‌కు బలయ్యారు. బ్రెజిల్లో మరణాల సంఖ్య 1.5లక్షలు దాటింది. బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్లో కరోనా విజృంభణ నేపథ్యంలో కరెన్సీ విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది.
బ్రెజిల్లో 1.5లక్షలు దాటిన కరోనా మరణాలు
By
Published : Oct 11, 2020, 6:13 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 3,75,23,094 మంది కరోనా బారినపడ్డారు. 10,78,404 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,81,57,404 మంది కరోనాను జయించారు.
బ్రెజిల్లో...
బ్రెజిల్లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ... మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 1,50,000మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో మరణాల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింది బ్రెజిల్.
దేశంలో ఇప్పటివరకు 50,91,840 కేసులు నమోదయ్యాయి.
ఇరాన్...
ఇరాన్‌లోనూ మరణాల సంఖ్య అధికారులను బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులో 251 మంది మృతిచెందారు. రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం.
మొత్తం కేసుల సంఖ్య 5,00,075గా ఉండగా.. ఇప్పటివరకు 28,544 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా సంక్షోభంతో దేశ కరెన్సీ అత్యల్ప స్థాయికి పడిపోవడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది.
బ్రిటన్‌లో...
బ్రిటన్‌లో కరోనా 2.0 తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పరిస్థితులు చెయ్యి దాటిపోయే స్థితికి చేరాయని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిప్యూటీ వైద్య సలహాదారు హెచ్చరించారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ఆంక్షలను త్వరలోనే ప్రకటించనున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.